ఘట్కేసర్, సెప్టెంబర్ 21 : సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తుండటంతో ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ 2వ వార్డులోని వివిధ పార్టీలకు చెందిన 60 మంది యువకులు బుధవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో, పోచారం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, చైర్మన్ కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి టీఆర్ఎస్ కండువాకప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు జరుపుతున్న అభివృద్ధి, సంక్షేమంతోనే యువకులు ఆకర్షితులై టీఆర్ఎస్ బాట పట్టారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో కొనసాగుతూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుందని మంత్రి వివరించారు.
ఏరాష్ట్రంలో లేని దళితబంధు, రైతుబీమా, చేనేతబీమా, ఆసరా పింఛన్, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. ఈ పథకాలకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టీఆర్ఎస్ జెండా కిందకు వస్తున్నారన్నారు. 2వ వార్డులోని సాయిగౌడ్, సుధీర్‌రెడ్డి, అరవింద్ క్రాంతి, సాయి, భరత్ రెడ్డి, వెంకటస్వామి తదితరులు పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శేఖర్, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి, ఎన్.కాశయ్య జి.శేఖర్, శశిధర్ రెడ్డి,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 21 : పేదల పాలిట వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి కాచవానిసింగారం గ్రామానికి చెందిన జావిద్‌కు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.55వేల విలువ గల చెక్కును మంత్రి మల్లారెడ్డి ఆయన నివాసంలో బుధవారం అందజేశారు. జావిద్ ఇటీవల అనారోగ్యంతో కార్పొరేట్ దవాఖానలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున మంత్రి సహకారంతో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు అయ్యాయి.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక, సంక్షేమ పథకాలతో ప్రతిఒక్కరూ లబ్ధిపొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.