అబిడ్స్, సెప్టెంబర్ 21 : ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవం పెరిగిందని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మంత్రి అన్నారు. బుధవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటుచేసిన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని 3265 మంది లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.200 ఉన్న పింఛన్‌ను తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు రూ. 2016, దివ్యాంగులకు రూ.3016 చొప్పున ప్రతినెలా వారి ఖాతాలో జమచేస్తున్నట్లు తెలిపారు. గతంలో రాష్ట్రంలో 40 లక్షల పింఛన్‌దారులుండగా ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మందికి కొత్తగా మంజూరుచేసి గుర్తింపుకార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ సందర్భంగా నూతన దుస్తులతో కానుకలు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పం పిణీ చేస్తున్నట్లు.. ఈ ఏడాది బతుకమ్మ వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు శంకర్ యాదవ్, రాకేశ్ జైశ్వాల్, సురేఖ, లాల్‌సింగ్, శశికళ, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్ వ్యాస్ బిలాల్, మాజీ కార్పొరేటర్లు మమతాగుప్తా, పరమేశ్వరిసింగ్ పాల్గొన్నారు.