సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి, రోగుల జీవిత కాలాన్ని పెంచే క్రమంలో తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి. నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన ఆధ్వర్యంలో మొబైల్ బస్సు ద్వారా రోగుల గుమ్మం వద్దకే వెళ్లి వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్‌లోనే కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వారంలో రెండు నుంచి మూడు చొప్పున ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా ఈ స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నారు. సాధారణంగా నమోదవుతున్న క్యాన్సర్ రోగుల్లో 40శాతానికి పైగా రోగులు తమకు వ్యాధి ఉన్నట్లు తెలియకుండానే జీవిస్తున్నారని, దీంతో వ్యాధి ముదిరిన తరువాత తీవ్ర లక్షణాలతో దవాఖానకు వస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కార్ ప్రారంభ దశలోనే క్యాన్సర్ వ్యాధులను గుర్తించి రోగుల ప్రాణాలు కాపాడే క్రమంలో ఎంఎన్‌జే దవాఖాన ద్వారా పెద్ద ఎత్తున స్క్రీనింగ్ టెస్టులకు శ్రీకారం చుట్టింది.
ఆరు నెలల్లో 38క్యాంప్‌లు
గడిచిన 6నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38 మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో 316 మందికి, వికారాబాద్ జిల్లాలో 248మందికి, నల్గొండ జిల్లాలో 223మందికి, కరీంనగర్ జిల్లాలో 125మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80మందికి, సిద్దిపేటలో 75మందికి, జగిత్యాల జిల్లాలో 110మందికి, మేడ్చల్ జిల్లాలో 64మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరిపారు.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో..
వారంలో 2నుంచి 3వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను బస్సు ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులను అధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, అక్కడి ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4020మందికి స్క్రీనింగ్ టెస్టులు జరిపారు.
ఎంఎన్జేలో చికిత్స
ఆరు నెలల కాలంలో నిర్వహించిన ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల ద్వారా 251మంది అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించినట్లు ఎంఎన్‌జే డైరెక్టర్ డా.జయలత తెలిపారు. వీరిలో 72మందికి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు వ్యాధి నిర్ధారణ జరిగిన వారందరికీ ఎంఎన్జేలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
సత్ఫలితాలు ఇస్తున్న క్యాంపులు
దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. చాలా మంది రోగులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తమకు వ్యాధి ఉందనే విషయం తెలియకుండానే జీవిస్తున్నారు. పలు రకాల క్యాన్సర్లలో వ్యాధి ముదిరిన తరువాతనే లక్షణాలు బయట పడుతాయి. ఈ క్రమంలో చాలా మంది రోగులు లాస్ట్ స్టేజ్‌లో దవాఖానకు వస్తున్నారు. దీంతో చెప్పుకోదగిన ఫలితం ఉండకపోవడమే కాకుండా రోగి కుటుంబం ఆర్థికంగా కూడా నష్టపోతుంది. గడిచిన 6నెలల్లో 4020మందికి స్క్రీనింగ్ చేస్తే అందులో 72మందికి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ఈ విషయం తమ వైద్యులు స్క్రీనింగ్ చేసేవరకు రోగులకు తెలియదు. క్యాన్సర్ నిర్ధారణ అయిన రోగులకు ఎంఎన్జేలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
– డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన