సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) / సుల్తాన్‌బజార్ : దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి రాష్ట్రం నలుమూలలా ప్రత్యేక బస్సులను నడుపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయకుండా సాధారణ చార్జీలతోనే బస్సులు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 4198 ప్రత్యేక బస్సులను నడుపడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ ఎ.శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం పి.జ్యోతి, ఎంజీబీఎస్ సీఆర్ఎం శ్రీనివాస్, హైదరాబాద్-1 డిపో మేనేజర్ రవీందర్, ఉప్పల్ డిపో మేనేజర్ ఎంఎం రెడ్డి, ఎంజీబీఎస్ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ సుధ, తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని ప్రత్యేక పాయింట్ల ద్వారా…
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలకు బస్సులను నడిపేందుకు ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు.
జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు షెడ్యూలు, స్పెషల్ బస్సులు
ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూర్, వరంగల్ వైపు షెడ్యూల్‌తో పాటు ప్రత్యేక బస్సులు
దిల్సుఖ్నగర్ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు షెడ్యూలు, స్పెషల్ బస్సులు
సీబీఎస్ నుంచి కర్నూలు, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, వెంకటాపురం, ధర్మవరం, మదనపల్లి, చిత్తూరు వైపు షెడ్యూలు, స్పెషల్ బస్సులు
ఎంజీబీఎస్ నుంచి బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నాగ్‌పూర్, అమరావతి, నాందేడ్, మహారాష్ట్ర వైపు షెడ్యూలు, స్పెషల్ బస్సులు
దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, జేబీఎస్‌కు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతామన్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా..
ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా జంట నగరాల్లోని ప్రత్యేక పాయింట్ల ద్వారా బస్సులను నడుపనున్నట్లు ఎ.శ్రీధర్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్ధం అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో ప్రత్యేక పాయింట్ల వద్ద అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలో 30మంది కంటే ఎక్కువగా ప్రయాణికులు ఉంటే స్థానిక డిపో మేనేజర్‌కు సమాచారం అందిస్తే వారి వద్దకే బస్సును పంపిస్తామని చెప్పారు. టికెట్ బుకింగ్ http://www.tsrtconline.inలో చేసుకోవాలని కోరారు.