అంబర్‌పేట, సెప్టెంబర్ 20 : దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు అయ్యారని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని రామకృష్ణనగర్ కమ్యూనిటీహాల్లో ఆసరా పింఛన్ లబ్ధిదారులు 300 మందికి అంబర్‌పేట మండల తహసీల్దార్ చింతకింది లలితతో కలిసి గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వృద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులకు రూ.500 పెన్షన్ ఇచ్చేవారిని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.2016, వికలాంగులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.3016 పెంచడం జరిగిందన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల మంది అర్హులకు ప్రభుత్వం నూతన పింఛన్లను మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు 77,695 నూతన పింఛన్లు మంజూరు కాగా, అందులో అంబర్‌పేటకు 6వేల పింఛన్లు వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచిన తరువాత లబ్దిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
పింఛను డబ్బుల కోసం లబ్దిదారులు అక్కడా, ఇక్కడా తిరిగే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయన్నారు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలి, గొప్పగా బతకాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం ప్రతిఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ సార్ మాత్రమే ఈ పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, ఇ.ఎస్.ధనుంజయ, అఫ్రోజ్పటేల్, కనివేట నర్సింగ్‌రావు, మిర్యాల రవీందర్, రమేశ్‌నాయక్, నవీన్‌యాదవ్, రాజేశ్, దారయోబు, శ్రీనివాస్ యాదవ్, కె.శ్రీనివాస్, కోట్ల సంతోష్, ప్రసాద్, బాబు, నరహరి, సుధాకర్, మండల స్పెషల్ ఆర్ఐ మహేశ్రాజు తదితరులు పాల్గొన్నారు.