ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్18 : తెలంగాణ అమరుల త్యాగాలను, పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలు ముందుకు వెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రంగారెడ్డి కలెక్టరేట్లో కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేయడంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో ఉన్నదని అన్నారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ఎనిమిదేళ్లలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వివిధ వేషధారణలు ధరించి చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అనంతరం కళాకారులు శివయ్య, అంజయ్య, భారతమ్మ, వెంకటస్వామి, క్రాంతి నారాయణతో పాటు వివధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వెంకటయ్య, శివకుమార్, జయరాం, బీమయ్య, నర్సింహులు, యాదయ్య, వసంత, సంధ్య సునీత తదితరులను మంత్రి సబితారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ దయానంద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, డీఈవో సుచిందర్రావు, ఆర్డీవో వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు సన్మానం
అంబర్‌పేట, సెప్టెంబర్ 18: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సీహెచ్ చంద్రమోహన్, ఎర్రబోలు నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కనివేట నర్సింగ్‌రావు, మిర్యాల రవీందర్, నవీన్‌యాదవ్, బొట్టుశ్రీను, బి.నర్సింగ్‌రావుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యతపై కవిసమ్మేళనం
కవులు, కళాకారులకు ఘన సన్మానం
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కవులు, కళాకారులను అదనపు కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో జాతీయ సమైక్యతా అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. మొత్తం 15 మంది కవులు, 10 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో భాను ప్రసాద్, జిల్లా మైనారిటీ అధికారి ఖాసీం, కలెక్టరేట్ పరిపాలనాధికారి సునీల్, రాములు తదితరులు పాల్గొన్నారు.