సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ ఐటీ కార్యకలాపాలకు కేంద్రంగా మారనున్న కోకాపేటలో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మహానగరాభివృద్ధ్ది సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే కోకాపేటలో భారీ లేఅవుట్‌ను నియోపోలిస్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్నది. సుమారు 529.66 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా చేపడుతోంది. 150, 120 అడుగుల వెడల్పుతో విశాలైన రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, మంచినీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. లేఅవుట్లో ముందుగా నిర్ణయించిన విధంగా బీటీ రోడ్లను వేస్తున్నారు. మరో వైపు వరద నీరు పారేందుకు భారీ ఎత్తయిన బాక్స్ డ్రైన్లను నిర్మిస్తున్నారు. దేశంలోనే మరే ఇతర లే అవుట్లో లేని విధంగా మౌలిక వసతులను హెచ్ఎండీఏ కల్పిస్తున్నది. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లను వెచ్చిస్తున్నారు.
నగరం పరిధిలో ఉండే ఈ లేఅవుట్లో ఎలాంటి జోనల్ పరిమితులు లేకుండా మల్టీ యూజ్ జోన్ (బహుళ వినియోగం)గా కోకాపేట లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తుండడంతో ఇది దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని అధికారులు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నలు దిక్కుల నుంచి కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌కు వచ్చి వెళ్లేందుకు విశాలమైన రోడ్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి హెచ్ఎడీఏంకు పంపించింది.
కోకాపేట్ లేఅవుట్‌ను కలుపుతూ లింకు రోడ్లు..
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఔటర్ రింగు రోడ్డు పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాంటి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌తో అనుసంధానిస్తూ హెచ్ఎండీఏ ట్రంపెట్‌ను నిర్మిస్తోంది. మరోవైపు నగరంలోని మెహిదీపట్నం, నార్సింగి మీదుగా శంకర్పల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ రెండు లింకు రోడ్లను 100 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రోడ్ డెవలప్మెంట్ ప్లాన్‌ను రూపొందించింది.
ఇందులోభాగంగా ప్రస్తుతం ఉన్న సుమారు 20 నుంచి 30 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల వెడల్పుతో నిర్మించాలని నిర్ణయించారు. మరో రహదారిని ఖానాపూర్ గ్రామం బయట నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంకర్‌పల్లిని కలుపుతూ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం హెచ్ఎండీఏ అధికారులకు పంపించడంతో క్షేత్ర స్థాయిలో ఆయా రహదారుల నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ, మార్కింగ్ వంటి పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.