ముషీరాబాద్, సెప్టెంబర్ 18: నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి బీజేపీ నేతలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలంగాణ దళిత ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్లుగా మోదీ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్గా నామకరణం చేయాలని కోరారు.
ఆదివారం రాంనగర్ డివిజన్ హరినగర్ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి గజ్జెల సూర్యనారాయణ, కార్యదర్శి స్వామి మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నగర ప్రధాన కార్యదర్శులు మల్లేశ్, శేఖర్, కోశాధికారి రవి, నగర కార్యదర్శి అరవింద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.