ఖైరతాబాద్, సెప్టెంబర్ 18 : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ ఆ పార్టీ నుంచి హోం మంత్రిగా ఉన్నారు….కానీ బీజేపీ నేతగా ఆ పార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గు చేటు అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఆదివారం సాయంత్రం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్ట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎక్కడ పాల్గొన్నదని ప్రశ్నించారు.
నేడు విమోచన దినమంటూ సర్దార్ పటేల్ పేరు చెప్పుకొని సంకలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17కు బీజేపీకి ఏం సంబంధం ఉందో చెప్పాలని, రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన వారు కమ్యూనిస్టులు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపిస్తే ప్రధాని మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ నూతన సచివాలయ భవనానికి అంబేద్కర్ నామకరణం చేసి కొత్త చరిత్రను సృష్టించారని అన్నారు.
దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయనకు దళిత, గిరిజన, బీసీలు అండగా ఉంటారన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పెరుపెట్టాలని వచ్చే నెల 26న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు కొమ్ము తిరుపతి, బొంకూరి సురేందర్ సన్నీ, రాష్ట్ర కార్యదర్శి సముద్రాల ప్రశాంత్ బాబు, నాయకులు సంజీవ్ నాయక్, నవీన్ నాయక్, భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బెల్లెట్ సుర్జీత్ రావన్ తదితరులు పాల్గొన్నారు.