మన్సూరాబాద్, సెప్టెంబర్ 18: వ్యర్థ రసాయనాలను డంపింగ్ చేస్తున్న వాహనాలను గుర్తించేందుకు ఆటోనగర్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్‌లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఆదివారం అటవీశాఖ అధికారులతో పాటు మార్నింగ్ వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేసి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజుల క్రితం వాకర్స్‌తో కలిసి హరిణ వనస్థలి నేషనల్ పార్కులో మార్నింగ్ వాక్ చేసిన సమయంలో పలు సమస్యలను వివరించారని తెలిపారు. ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ట్రాక్‌పై అక్కడక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను గుర్తించి వాటిని వెంటనే తొలగింపజేశామని తెలిపారు. వాకర్స్ కోసం మూత్రశాలలు ఏర్పాటు చేశామని వాటికి త్వరలో నీటి కనెక్షన్‌తో పాటు విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తామని తెలిపారు. సెలవు దినమైన సోమవారం రోజున సైతం హరిణ వనస్థలి నేషనల్ పార్కును తెరిపించి వాకర్స్ యథావిధిగా వాకింగ్ చేసుకునేలా సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఆటోనగర్‌లోని లారీల అడ్డాను ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి, అటవీశాఖ అధికారులు విష్ణువర్ధన్, విద్యాసాగర్, సాయి వరుణ్, నాయకులు పోచబోయిన జగదీశ్‌యాదవ్, శ్రీధర్‌గౌడ్, లక్ష్మారెడ్డి, భాస్కర్‌సాగర్, నందారెడ్డి, ఉమేశ్, సునీల్‌రెడ్డి, జగన్, జైపాల్, సుధీర్‌రెడ్డి, మధుసూదన్, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.