కందుకూరు, సెప్టెంబర్ 18: స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. అనేక పథకాలను ప్రవేశపెడుతూ.. పేదల కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. పేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, వికలాంగులకు, కిడ్నీ బాధితుల కోసం ఆసరా పథకాన్ని ప్రారంభించి నెలకు రూ.200/-లు ఉన్న పింఛన్‌ను రూ.2016, రూ.3016లు ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన పేదలను మాత్రం ఇబ్బందులకు గురిచేయడం లేదు. దీంతో వృద్ధులు, పింఛన్ పొందుతున్న వారందరు సీఎంను కొనియాడుతున్నారు. వృద్ధులైతే పింఛన్ తీసుకుంటూ సీఎం కేసీఆర్ తమ పెద్ద కొడుకని దీవిస్తున్నారు. ప్రస్తుతం మండలంలో 35 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో 4,739 మందికి ప్రభుత్వం పింఛన్లను అందజేస్తుండగా ప్రస్తుతం 1,723 మందికి నూతనంగా పింఛనన్లు మంజూరు అయ్యాయి. గ్రామాల్లో మంజూరు పత్రాలను అందజేస్తున్నారు. దీంతో మండలంలో మొత్తం 6,462 మందికి ఆసరా పింఛన్లు అందనున్నాయి. దీంతో పేదలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలను తెలిపారు.
పేదలకు అండగా ప్రభుత్వం..
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది. సీఎం కేసీఆర్ పేదలకు ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్నాడు. దీంతో వారికి ఎంతో ఆసరాగా ఉంటుంది. గ్రామాల్లోకి వెళ్లి మంజూరైన పత్రాలను అందజేస్తుంటే వృద్ధులు కేసీఆర్‌ను దీవిస్తుంటే ఆనందం కలుగుతుంది. గతంలో రూ. 200లు ఉన్న పింఛన్‌ను రూ.2016, రూ.3016లను అందజేస్తుండు.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
సీఎం కేసీఆర్ చల్లంగా ఉండాలి..
సీఎం కేసీఆర్ చల్లంగా ఉండాలి, ప్రతి నెల తనకు క్రమం తప్పకుండా పింఛన్ వస్తుంది. ఏ దిక్కు లేని తనకు తెలంగాణ ప్రభుత్వం దిక్కు. ప్రభుత్వం అందజేసే పింఛన్ తనకు ఎంతో ఆసరాగా ఉంటుంది. కుటుంబ పోషణకు భరోసాగా ఉంది. పది కాలల పాటు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉండాలి.
– పద్మమ్మ, ఒంటరి మహిళా, రాచులూరు
మండలంలో 6,462 మందికి..
వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, కిడ్నీ బాధితులకు, వికలాంగులకు ప్రస్తుతం 1723 మందికి పింఛన్లు మంజూరు అయ్యాయి. గతంలో 4739 మందికి పింఛన్లు అందుతున్నాయి. మొత్తం మండలంలోని 35 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో 6,462 మందికి ఆసరా పింఛన్లు అందుతాయి.
– వెంకట్రాములు, ఎంపీడీవో కందుకూరు