సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ): నగరంలో అగ్ని ప్రమాద సంఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇటీవల నగరంలో పలు అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, జోనల్ వ్యాప్తంగా కమర్షియల్ బిల్డింగ్‌ల పూర్తి సమాచారాన్ని జోనల్ కమిషనర్లు సేకరించాలని మేయర్ సూచించారు.
ప్రస్తుతం ట్యాక్స్ చెల్లిస్తున్న కమర్షియల్ భవనాల వివరాలు తోడుగా కొత్తగా నిర్మించిన భవనాల వివరాలు కూడా సేకరించి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వాణిజ్య భవనాలకు జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా టౌన్‌ప్లానింగ్ అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇక ముందు అధికారులు పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, టెక్స్ టైల్స్ షోరూంలు, గోడౌన్లలో కమర్షియల్ భవనాలు వాణిజ్య సముదాయాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు మేయర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ శృతి ఓజా ,ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజీత్ , సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు మమత, రవి కిరణ్, శంకరయ్య, పంకజ, అశోక్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.