కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 15: ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘కూకట్పల్లిలో ఉన్న 9 చెరువుల కబ్జాలలో టీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నా, నా హస్తం ఉన్నా నేను రాజీనామా చేస్తా. మీ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నరు కదా. వాళ్లలో ఒకరిని ఇక్కడికి రమ్మను.
నేనూ వస్తా. ఆ కబ్జా చేసింది బీజేపీ వాళ్లేనని అందరిముందే ప్రూవ్ చేస్తా. నల్లచెరువు, ఐడీఎల్, పరికిచర్ల చెరువు, మైసమ్మ చెరువుల్లో ఎవరు కబ్జా పెట్టిండ్రో నా దగ్గర ఆధారాలు ఉన్నయి. ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎవరు ఏమిటో తెలుసుకొని రావాలి. అంతేగానీ ఎవరో స్లిప్పు రాసియ్యంగనే ఆ స్లిప్పులో ఉన్నదే చదువుతవా? మా తప్పుందని తేలితే నేను రాజీనామా చేస్తా. మీవోళ్ల తప్పుందని తేలితే నీవు రాజీనామా చేస్తవా?’ అని సవాల్ విసిరారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.