సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల విజయవంతంగా నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో 17,79,740మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1-19 ఏండ్ల మధ్య వయస్సు గల 10,71, 855మంది పిల్లలను గుర్తించగా గురువారం ఒక్కరోజే 9,89,236మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి అదనపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జయమాలిని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.శశికళ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి వెంకటి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య సంరక్షణలో అల్బెండజోల్ మాత్రలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.1-19 ఏండ్ల మధ్య వయస్సు పిల్లల్లో నులిపురుగులు కడుపులో ఏర్పడటం వల్ల వారు పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని, ఆ సమస్యలకు చెక్ పెట్టడానికే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న జాతీయ నులిపురుగుల నివారణ దినంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలందరికీ ఈ మాత్రలు వేయించాలని సూచించారు. ఈనెల 22న మాప్-అప్ రౌండ్ నిర్వహించి మిగిలిన పిల్లలకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో 8,70,650మంది పిల్లలను గుర్తించగా వారిలో గురువారం ఒక్కరోజే 7,90,504మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో 9,90,563మంది పిల్లలను గుర్తించగా వారిలో గురువారం ఒక్కరోజే 9,23,299 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.