కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 15 : వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా ఫించన్లు భరోసా కల్పిస్తున్నాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లో 800 మంది కొత్తగా ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావులు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు వృద్ధులకు కేవలం రూ.200, దివ్యాంగులకు రూ.500లు పింఛన్లు మాత్రమే ఇచ్చేవారని.. నేడు సీఎం కేసీఆర్ వృద్ధులకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.3వేల పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు.
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతంగా ఉందని దేశంలో ఎక్కడాలేనివిధంగా ఆసరా పింఛన్లను అందిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఆసరా పింఛన్లు ఈ స్థాయిలో ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పేదలకు కల్యాణలక్ష్మి, వృద్ధులకు ఆసరా పింఛన్లు, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలతో పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని కొనియాడారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 20 వేలకు పైగా ఆసరా పింఛన్లు అందుతున్నాయని.. కొత్తగా మరో 10,372 మందికి ఆసరా పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. లబ్ధిదారులందరి ఖాతాలో డబ్బులు పడతాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని దళారుల మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, సాయిబాబా చౌదరి, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి రాజేశ్ తదితరులున్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్లో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ గురువారం తన కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, కాశీనాథ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్నగర్లోని సాయిబాబా ఆలయంలో కార్పొరేటర్ పూజలలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు.
– మియాపూర్, సెప్టెంబరు 15
ఆసరా పింఛన్తో రూ.2వేలు ఇస్తున్నందుకు నాలాంటి వృద్ధులంతా సంతోషంగా ఉన్నారు. ముసలితనంలో పిల్లలను డబ్బులు అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందించడం గొప్ప విషయం. ప్రతినెలా వచ్చే డబ్బులతో చిన్నచిన్న ఖర్చులు తీర్చుకుంటా. పిల్లలను చేయిచాపి అడిగే పరిస్థితి ఉండదు.
– లక్ష్మీ, కేపీహెచ్బీ కాలనీ
ఆసరా పింఛన్లతో వృద్ధులను ఆదుకుంటున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే పిలిచి మరీ గుర్తింపు కార్డునిచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల కష్టాలను తెలుసుకుని పింఛన్ ఇవ్వడం గొప్ప విషయం. పేదవారి కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పింఛన్లు ఇస్తున్నందుకు మేమంతా రుణపడి ఉంటాం.
– జి.గోదావరి, కేపీహెచ్బీ కాలనీ