ఎల్బీనగర్, సెప్టెంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జయప్ర దం చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిపిలుపునిచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఎమ్మె ల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్, ఫైర్, మెడికల్, ప్రాజెక్టు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహంచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 17 సెప్టెంబర్ 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగిడుస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజల పోరాట పటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఘనంగా చాటేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం సరూర్‌నగర్ వీఎం హోమ్ నుండి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
అనంతరం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. తదనంతరం ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి ఒక్క అధికారి వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ర్యాలీ నేపథ్యంలో ప్రజలకు ట్రాఫిక్‌కు అంతరాయం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు, రంగారెడ్డి జిల్లా హౌజింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, డీఈఓ సుశీందర్ రావు, ఏసీపీలు శ్రీధర్‌రెడ్డి, అంజయ్య, ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, ఎంఆర్ఓలు, పలువురు ఇన్స్పెక్టర్లు, డీఈలు, ఏఈలు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.