ఘట్కేసర్,సెప్టెంబర్ 15 : వర్షాకాలం ఆరంభం నుంచి కురుస్తున్న వర్షాలకు పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇటీవల చెరువుల్లో ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులు చేపపిల్లలు వదిలారు. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో సమీప బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీలో చిన్న చెరువు, రావి, తెట్టేరు చెరువులు, బావన కుంట, పోచారం మున్సిపాలిటీలో పెరుమళ్ల, మీరాలం, బందం , తుమ్మల, వడ్లవాని కుంటలు , నారపల్లి పెద్ద చెరువులు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల్లో పూడికమట్టిని తీయడంతో నీటి నిలువ సామర్థ్యం పెరిగి వర్షపు నీటితో నిండుగా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలను చెరువు సొసైటీల ఆధ్వర్యంలో చెరువుల్లో వదిలారు.
ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువుల్లో వదలడంతో మత్స్యకారులకు ప్రయోజనం చేకూరనున్నది. దీనికి తోడు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను అభివృద్ధి చేసి, వాటిలో నీటి నిలువ సామర్థ్యం పెంచింది. వరుణుడు కరుణించడంతో చెరువుల్లో నిండుగా నీరు ఉంది. ఈ ఏడు మత్సకారులకు చేతినిండా ఉపాధి దొరకనుంది. మత్స్యకార సంఘాలకు ప్రభుత్వం వాహనాల ఏర్పాటు, మార్కెట్ సదుపాయం కూడా కల్పించాలి.
-మేడబోయిన నరేశ్ ముదిరాజ్,ఘట్కేసర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు