సిటీబ్యూరో/మేడ్చల్/ రంగారెడ్డి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి మార్గదర్శనం చేస్తున్నది. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర పన్నుతున్న బీజేపీకి బుద్ధి చెప్పే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ మోడల్ దేశానికి అత్యవసరమంటూ.. నవ భారత నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. అలుపెరుగని పోరాట స్ఫూర్తితో దేశ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని రిటైర్డ్ ఉద్యోగులు ముక్తకంఠంతో చెబుతున్నారు. దేశానికి ప్రస్తుత నాయకత్వాన్ని పక్కన పెట్టి సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని పదవీ విరమణ పొందిన దాదాపు 1.05 లక్షల మంది రిటైర్ద్ ఉద్యోగులు దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 శాతం అదనంగా పెన్షన్ ప్రయోజనం పొందుతున్నామని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మయ్య అన్నారు. హెల్త్‌కార్డులతో కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. తెలంగాణలో అమలు చేసినట్లుగానే దేశ ప్రజలను కూడా అన్ని రకాలుగా ఆదుకోగల సత్తా కేసీఆర్‌కే ఉందని, అలాంటి నాయకులు దేశానికి ఎంతో అవసరమని స్పష్టం చేస్తున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే
తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధి, కార్మిక, పెన్షనర్ల వంటి సబ్బండ వర్గాలను ఏకం చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రా పాలకులలు చేసిన అన్యాయాలను ఎదురిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్. ఇదే స్ఫూర్తితో కేంద్రం మెడలు వంచాలి. తెలంగాణపై కేంద్ర వివక్షను ఎదురిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– మోహన నారాయణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు
వెనుకబడిన వర్గాలకు మేలు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలలోకి రావడం వల్ల వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుంది. తెలంగాణలో ఎస్సి, ఎస్టి, బీసిలకు అమలుచేస్తున్న పథకాలు దేశమంతటా అందితే ఆయా వర్గాలు అభివృద్ధిలోకి వస్తాయి. అన్నదాతకు అండగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తే రైతులకు, బలహీన వర్గాలకు బలం చేకూరుతుంది. అన్నదాతకు రైతు బంధు పేదలకు ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. పేదల కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో అమలయ్యే అవకాశాలున్నందున కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాము.
– కృష్ణశర్మ, విశ్రాంత ఉద్యోగి
దేశంలో గుణాత్మక మార్పు ఖాయం
విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల వంటి రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి కేసీఆర్ కార్యదక్షతను సూచిస్తున్నాయి. ఈ రంగాలపై తనదైన విధానాలతో ముందుకుపోయిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే.. అక్కడి కూడా చక్కటి మార్పులకు శ్రీకారం చుట్టే వీలుంది. కొవిడ్ సమయంలో గాంధీ దవాఖానను వ్యాధిగ్రస్తుల చికిత్సకు సమాయత్తం చేసిన తీరు మహాద్భుతం. చక్కటి విజన్ ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశంలో ఖచ్చితంగా గుణాత్మకమైన మార్పు వస్తుందనడంలో సందేహం లేదు.
– బీ.పీ.దూబే, రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్, ఎస్ఆర్నగర్
కేసీఆర్‌తోనే మతచిచ్చులకు అడ్డుకట్ట
మతాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర పన్నుతున్న బీజేపీ ఆటలకు అడ్డుకట్ట వేయాల్సిందే. ఇది జరగాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన సరైన సమయమిదే. అన్ని మతాల వాళ్లు తెలంగాణలో సోదర భావంతో కలిసి మెలిసి ఉంటున్నారంటే అది కేసీఆర్ అవలంబిస్తున్న పరిపాలనా విధానమే. ఈ విధానం జాతీయ స్థాయిలో
అవసరం ఎంతయినా ఉన్నది.
– ఎంఏ సత్తార్, రిటైర్డ్ ఉద్యోగి
రైతులకు మంచి రోజులు
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల దశ మారింది. రైతుల గోస తెలిసిన మా పెద్ద రైతన్న సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి, కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్. సాగు చేసుకోవడానికి ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సహాయం, ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కేసీఆర్‌దే. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టడం శుభపరిణామం. ఆయన ప్రధాని అయితే దేశంలోని రైతులకు మంచిరోజలు వచ్చినట్టె.
– మహమ్మద్ సాదుల్లా హుస్సేన్, రిటైర్డ్ ఉద్యోగి