ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 13: నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు అన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ పేరును పార్లమెంట్ భవనానికి పెట్టాలని తీర్మానం చేసిన కేసీఆర్‌కు దళిత సంఘాలు, విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దళితుల అభ్యున్నతికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగం అవినాశ్, కార్యదర్శి దశరథ్, నాయకులు బొల్లు నాగరాజుయాదవ్, జలంధర్, ప్రవీణ్, శేషు, రాజు, రామకృష్ణ, శ్రీను, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు ధన్యవాదాలు..
పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపించడం చారిత్రాత్మకమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, గుండగాని కిరణ్‌గౌడ్ వేర్వేరు ప్రకటనలో కొనియాడారు. ఈ తీర్మానం చేసేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యావత్ తెలంగాణ విద్యార్థి, యువత తరపున ధన్యవాదాలు తెలిపారు.
హర్షణీయం
ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు విద్యార్థి సంఘాల తరపున కృతజ్ఞతలు.
– ఎర్రవల్లి జగన్, జేఎన్టీయూహెచ్ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్