సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 13 (నమస్తే తెలంగాణ);కానరాని మౌలిక వసతులు.. దశాబ్దాలుగా పూరి గుడిసెల్లోనే నిరుపేదల అవస్థలు.. రోడ్ల మూసివేతతో నిత్యం తిప్పలు.. ఇదీ కంటోన్మెంట్ ప్రాంతం దుస్థితి. మహానగరంలో నడిబొడ్డున ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కేంద్రం ఈ ప్రాంతంపై శీతకన్ను ప్రదర్శిస్తున్నది. పైగా బోర్డుకు ఇవ్వాల్సిన రూ. 800కోట్ల సర్వీసు చార్జీల బకాయిలపై మౌనం వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్కైవేల నిర్మాణానికి ముందుకొచ్చినా.. భూములు ఇవ్వకుండా కొర్రీ లు పెట్టింది. ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలోనే కంటోన్మెంట్ బోర్డు ఉన్నప్పటికీ ఆయన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించకపోగా, కనీసం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన దాఖలాలూ లేవు. ఇటీవల కేంద్రం పలు కంటోన్మెంట్లకు గ్రాంట్ ఇన్ఎయిడ్ కింద రూ.177 కోట్లు విడుదల చేసినా.. ఇక్కడి బోర్డుకు పైసా ఇవ్వలేదు. వీటిన్నంటికీ సమాధానం చెప్పి.. ఇక్కడ పాదయాత్రకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కంటోన్మెంట్ బోర్డు వాసులు కోరుతున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు దాదాపు పదివేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఏడు వేల ఎకరాలు పూర్తిగా మిలటరీ ఆధీనంలో ఉండగా… మిగతా మూడు వేల ఎకరాల్లో సాధారణ ప్రజల నివాసాలు ఉన్నాయి. భారీ ఎత్తున విస్తరించిన హైదరాబాద్ మహా నగరంలో కంటోన్మెంట్ బోర్డు అనేది నడిబొడ్డుగా మారింది. ఈ క్రమంలో సాధారణ జన జీవనంపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతూ, అభివృద్ధి కూడా బోర్డు పరిధిలోకి విస్తరించడం లేదు. దీంతో బోర్డులోని కాలనీల జనమే కాకుండా బోర్డు మీదుగా రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రతి రోజూ ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. అయితే బోర్డు పరిధిలో రోడ్ల మూసివేత మొదలు అనేక సమస్యలపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఉద్దేశపూర్వకంగా కేంద్రం నిర్లక్ష్యం వహించడం ఒకవంతైతే… ఇక్కడి స్థానిక మిలటరీ అధికారుల నిర్ణయాలతో కంటోన్మెంట్ సమస్యల సుడిగుండలో చిక్కుకుపోయింది.
పరిష్కరించాల్సినవారే.. గగ్గోలు పెడితే..
కంటోన్మెంట్ పరిధిలోని సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. పైగా కంటోన్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో క్షణాల్లో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించాలి. కానీ నిత్యం తెలంగాణ ప్రభుత్వంపై అనవసర విమర్శలతో రాద్దాంతం చేసే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీసం పరిష్కారానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. అయినా… రేపటి నుంచి రెండు రోజుల పాటు బండి సంజయ్ బోర్డు పరిధిలో పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగానైనా కంటోన్మెంట్ సమస్యల పరిష్కారంపై మాట్లాడుతారా? లేక యధావిధిగా ఊకదంపుడు, పసలేని విమర్శలతో రాజకీయ పబ్బం గడుపుతారా? అనేది వేచి చూడాలి.
బండీ.. ఈ రోడ్లను తెరిపించు..
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తరచూ మిలటరీ అధికారులు రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం ఒక రోడ్డు నుంచి వెళ్లిన వారు తిరిగి సాయంత్రం అదే రోడ్డు నుంచి తిరుగు టపా వస్తారో రారో తెలియని అయోమయ పరిస్థితి. ప్రస్తుతం కూడా బోర్డు పరిధిలో లడ్డావాలా రోడ్డు, హోలీ ట్రినిటీ చర్చ్ రోడ్డు, మిల్కాసింగ్ కాలనీ రోడ్డు, బొల్లారం పార్కు పక్కన రోడ్డు, అమ్ముగూడ వద్ద ఉన్న బట్టికలోనా రోడ్డు, లాల్‌బజార్ నుంచి ఫ్యాకల్టీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రోడ్డు, ఎంప్రస్ రోడ్డు మూసివేసి ఉన్నాయి.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనిప్రధాన సమస్యలివి..
కంటోన్మెంట్లో అధికంగా రక్షణ శాఖ స్థలాలు ఉన్నాయి. ఆంగ్లేయుల కాలంలో వారి ఇండ్లల్లో పని చేసుకుంటూ ఇదే ప్రాంతంలో గుడిసెలు వేసుకొని పేదలు జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి స్థలాల్లో ఉన్న వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా సాంకేతికంగా ఇచ్చే వీలు లేదు. సెంట్రల్ బస్తీ, నెహ్రూ సెంటినరీ కాలనీ, చిన్న కమేళా, నందమూరినగర్, మడ్‌ఫోర్టు ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని లోకల్ మిలటరీ అధికారులు హుకూం జారీ చేయడంతో దశాబ్దాలుగా ప్రజలు ఇప్పటికీ పూరి గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి పట్టాలు ఇచ్చేందుకుగాను బదులుగా వికారాబాద్‌లో వంద ఎకరాలు కేటాయించినప్పటికీ మిలటరీ అధికారులు కొర్రీ పెట్టడంతో నిరుపేదలకు నిరాశే మిగిలింది.