సిటీబ్యూరో/బేగంపేట/మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న లిథియం బ్యాటరీని చార్జింగ్ పెట్టడంతో అందులో మంటలు చెలరేగి.. అది షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసిందని, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఇదే అయి ఉంటుందని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇతర కోణాల్లో కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో సుప్రీత్ సింగ్ కుమారులు రాజేందర్‌సింగ్, సుమిత్‌సింగ్ ఓ భవనం సెల్లార్లో రూబీ మోటర్స్ (ఎలక్ట్రిక్ బైక్ (జిమో పై)), గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మరో నాలుగు అంతస్తుల్లో రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. లాడ్జి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు అందులో బస చేస్తుంటారు. ఈ భవనం సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్‌ల విక్రయాలు, ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తున్నారు.
అసలేమైంది..
నిర్వాహకులు సోమవారం రాత్రి ఎలక్ట్రిక్ బైక్‌ల బ్యాటరీలకు చార్జింగ్కు పెట్టారు. ఆ తర్వాత సెల్లార్లో ఉన్న షోరూంకు తాళం వేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటిలో అందులో నుంచి పొగలు రావడం మొదలైంది. రాత్రి 9.37 గంటలకు అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అప్పటికే సెల్లార్లో ఉన్న 37 ఎలక్ట్రిక్ బైక్‌లు, మరో 10 ఇతర బైక్‌లు మంటల్లో ఉన్నాయి. ఆ మంటలు ఆర్పేందుకు ఫైర్ అధికారులు రంగంలోకి దిగారు. అప్పటికే భారీగా మంటలు ఎగిసిపడుతూ.. దట్టమైన పొగలు భవనం చుట్టూ అలుముకున్నాయి. సెల్లార్లో నుంచి ఉన్న మెట్ల మార్గం ద్వారా పైనున్న లాడ్జిలోకి పొగ చేరుకుంది. లాడ్జి గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఉంది. మొదటి అంతస్తు నుంచి గదులు ఉన్నాయి. పొగ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లోకి భారీగా చేరింది.
అప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన లాడ్జిలో బస చేస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడేందుకు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు కిటికీల్లో నుంచి, మరికొందరు రిసెప్షన్ నుంచి బయటకు వెళ్లేందుకు పరుగులు తీశారు. ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిని పొగ కుమ్ముకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఆక్సిజన్ పూర్తిగా ఖాళీ అయి, కార్బన్ మోనాక్సైడ్ నిండిపోయింది. బైక్‌ల టైర్లు, సీటు కవర్లు మంటల్లో కాలిపోవడంతో భారీగా పొగ వచ్చింది. భవనంలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన వారు ఆ పొగను పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అగ్నిమాపక శాఖ, పోలీసులు లాడ్జిలో ఉన్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకొని పడిపోయిన వారందరినీ చికిత్స నిమిత్తం దవాఖానలకు తరలించగా, వారిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో మరొకరు మంగళవారం ఉదయం మృతి చెందారు.
ఎనిమిది మంది మృతి.. 9 మందికి గాయాలు ..
ఈ ఘటనలో మృతి చెందిన వారిలో విజయవాడకు చెందిన అల్లాడి హరీశ్ (33), ఢిల్లీకి చెందిన వ్యాపారి వీరేందర్ కుమార్ దివాకర్(50), రాజీవ్ మైక్ (34), సందీప్ మాలిక్‌తో పాటు చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త సీతారామన్(48), ఆచీ మసాల ఫుడ్ వ్యాపారి బాలాజీ(58)ని గుర్తించారు. ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. బెంగళూరుకు చెందిన జయంత్(39) పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. గాయపడిన వారంతా యశోద, అపోలో, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో వైజాగ్‌కు చెందిన కేవీ సంతోష్, కోల్కత్తకు చెందిన శిశ్ గుప్తా, వైజాగ్‌కు చెందిన యోగిత, చెన్నై వాసి కేకే కేశవన్ , హర్యానాకు చెందిన దీపక్ యాదవ్, ఒడిశాకు చెందిన ఉమేశ్ కుమార్ ఆచార్య, నగరానికి చెందిన మన్మోహన్ కన్నా, గుజరాత్ సూరత్‌కు చెందిన రాజేశ్ జగదీశ్ చంద్ర ఉన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు..
ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఫైర్ సేఫ్టీ అడిషినల్ డీజీ సంజయ్‌జైన్ తదితర అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… బిల్డింగ్ సెల్లార్‌ను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉన్నదన్నారు.మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్టు ప్రకటించారు. బైక్ షోరూం నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు.