సిటీబ్యూరో/బేగంపేట/మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): రూబీ మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కాగా పోలీసులు ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు. బైక్‌లకు చార్జింగ్ పెట్టిన చోటు నుంచే మంటలు వ్యాపించినట్లు పోలీసులు గుర్తించారు.
నిర్వాహకులపై కేసు..
నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో రెండు వ్యాపార సముదాయాలను నిర్వహిస్తూ 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన నిర్వాహకులు రాజేందర్‌సింగ్, సుమీత్ సింగ్‌పై 304, 324 సెక్షన్లలో కేసు నమోదు చేసినట్టు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు. అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన చైన్నైకి చెందిన బాలాజీ సీతారాం, విజయవాడకు చెందిన హరీశ్‌కు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించినట్లు చెప్పారు. మిగిలిన వారికి కూడా పోస్టుమార్టం జరుగుతుందని తెలిపారు. మరో ఆరుగురి కుటుంబ సభ్యులు రావాల్సి ఉన్నదని వెల్లడించారు.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ విచారణ..
‘రూబీ’లో జరిగిన అగ్నిప్రమాదంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మంగళవారం నగరానికి చేరుకున్న వారు ప్రమాదం జరిగిన తీరు, ప్రాణ, ఆస్తి నష్టాన్ని పరిగణలోకి తీసుకొని నివేదిక రూపొందించనున్నారు.