బంజారాహిల్స్,సెప్టెంబర్ 13: దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానంతో హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగం మంచి అభివృద్ధి సాధిస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు చెందిన వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ..నిర్మాణరంగంలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు. బీపాస్ విధానం దేశంలోనే ఎక్కడా లేదని అన్నారు. అక్రమ నిర్మాణాలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని అరికట్టే అంశంపై ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బిల్డర్స్ అసోసియేషన్లు కూడా సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌కు చెందిన సావనీర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణ, వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్,ప్రధాన కార్యదర్శి కేవీ.ప్రసాద్, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎన్ఏఆర్ఈడీసీవో) క్రెడా అధ్యక్షుడు సునీల్‌చంద్రారెడ్డి,తో పాటు పలు బిల్డర్స్ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు.