మాదాపూర్, సెప్టెంబర్ 13 : పెట్టుబడులకు హైదరాబాద్‌ను ఇష్టపడటమే కాకుండా ఆసక్తిగా ముందుకు వస్తున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఇండియన్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని హెచ్ఐసీసీలో ఇండియన్ రెస్టారెంట్ కాంక్లేవ్- 2022 పేరిట మంగళవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయేశ్‌రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఐఆర్ఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. అసోసియేషన్ ప్రతినిధులు సహా ఆయా సంస్థల ప్రతినిధులను జయేశ్ రంజన్ అభినందించారు. పెట్టుబడుల ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రెస్టారెంట్ల నిర్వహణ రంగంలో ఐఆర్ఏ ఎంతో డైనమిజంను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. నిర్వాహకులకు ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న సింగిల్ విండో విధానంతో అనుమతుల ప్రక్రియ ఎంతో సులువుగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డైరెక్టర్ శిఖా గోయల్, ఐఆర్ఏ వ్యవస్థాపకులు తాజ్ మహ్మద్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.