సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణ వితరణ చేసి, రాష్ట్రంలోనే హైదరాబాద్ జిల్లా మొదటిస్థానంలో నిలుపాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బ్యాంకర్లను కోరారు. ప్రభుత్వ పథకాలు అమలుకు సంబంధించిన అంశాలపై మంగళవారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో అదనపు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు అధికారులు నామినేట్ చేసిన బాధ్యత గల అధికారులు డీసీసీ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదే అని అన్నారు.
ఈ సందర్భంగా లక్ష్యాలను సాధించకపోవడానికి గల కారణాలను బ్యాంకర్లను అడిగి తెలుసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో గ్రౌండింగ్ పెండింగ్‌లో ఉన్న యూనిట్లకు వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లకు యూసీలు వెంటనే ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలో 2022-23 సంవత్సరానికి కేటాయించిన రూ.21,273.40 కోట్లు గాను ఈ ఏడాది జూన్ 2022 ఆఖరుకు రూ.13,390.64 కోట్లకు అంటే 63 శాతం పథకాలు గ్రౌండింగ్ సాధించినట్లు తెలిపారు. అలాగే ప్రయారిటీ సెక్టార్లో రూ.25,413 కోట్లకు గాను రూ.16,607.22 కోట్లు అంటే 65 శాతం గ్రౌండింగ్ సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ అధికారి ప్రవీణ్‌కుమార్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఖాసీం, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.