నమస్తే తెలంగాణ, నెట్వర్క్ : తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుందంటారు.. అలాంటి తరగతి గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులంతా దేశ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ‘మన ఊరు – మన బడి’తో సర్కారు బడుల రూపురేఖలు మార్చేసిన కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినట్లయితే దేశ విద్యావ్యవస్థనే సమూల ప్రక్షాళన చేస్తారని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. కేంద్రంలోనిబీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని, ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులు వేస్తూ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి దశ, దిశ చూపే సమర్థ నాయకత్వం అవసరమని, అలాంటి సమర్థనాయకుడు కేసీఆరేనని ముక్తకంఠంతో నినదించారు.
శుభపరిణామం
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడే పరిస్థితికి ఉద్యోగులను దిగజార్చారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం శుభపరిణామం. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలో ఆలోచించి దూరదృష్టితో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే గొప్పనాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శపాలన సాగిస్తున్న ఘనత ఆయన సొంతం.
విజన్ ఉన్న నాయకుడు..
ఉత్తరాది పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణ రాష్ర్టాన్ని చిన్నచూపు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌లాంటి విజన్ ఉన్న నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతదేశం అర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా చాలా వస్తాయి. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది.
– శాంత, బబ్బుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు
సంకల్పబలంతో ముందుకెళ్లాలి
సీఎం కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనిస్తున్నారు. పేదల కడుపు నింపుతున్నాడనే బలమైన నమ్మకాన్ని కేసీఆర్ ఏర్పరుచుకున్నారు. సంకల్ప బలంతో ముందుకు వెళ్తే కేసీఆర్ విజయ తీరాలకు చేరుతారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను దేశ ప్రజలు కావాలని ఆకాంక్షిస్తున్నారు.
కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 12: దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఒక జాతీయ పార్టీ ఆవిర్భావిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పాపన్న సేన పార్టీ (పీఎస్పీ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్ తెలిపారు. ఇప్పటి వరకు ఉత్తర భారతదేశం నుంచి జాతీయ పార్టీలుగా ఆవిర్భవించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆరోపించారు. దక్షిణ భారత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అభివృద్ధిని అణగదొక్కుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారి కేసీఆర్ దక్షిణ భారతదేశ బిడ్డగా ఒక జాతీయ పార్టీ నిర్మించతలపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
– పాపన్న సేన పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్
కేసీఆర్ సఫలీకృతం కావాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు రైతులు, పేదలు, మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దేశాల రాజకీయల్లోకి సీఎం కేసీఆర్ పోవటంతో దేశ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు.
– మహ్మద్ షుజాఉద్దీన్,కొత్తపేట సక్సెస్ స్కూల్ డైరెక్టర్
కేసీఆరే సమర్థుడు
జాతీయ రాజకీయాల్లో మార్పును తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేయాలంటే సమర్థవంతమైన నాయకుడు అవసరం. ప్రస్తుతం దేశాభివృద్ధి జరుగాలంటే తెలంగాణ రాష్ర్టాన్ని దేశ పటంలో రోల్ మోడల్‌గా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం అవసరం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే గొప్పవిజన్ ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే.
– చిన్న బత్తిని శౌరి, నల్లగుట్ట
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ప్రజలు మార్పు కోరుతున్నారు
స్వాతంత్య్రం వచ్చినప్పటి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. దేశరాజకీయాల్లో కొత్త మార్పును ప్రజలు కోరుకుంటున్నారు. సమర్థవంతమైన నాయకత్వం, సుపరిపాలన అందించే నాయకుడి అవసరం దేశానికి ఉంది. తెలంగాణలో ఆదర్శ పాలన సాగించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
– ఉదయశ్రీ, ఉపాధ్యాయురాలు,రాంగోపాల్‌పేట ప్రభుత్వ పాఠశాల
దేశ వ్యాప్తంగా గుర్తింపు
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశంలో అద్భుత పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు. విద్యుత్ కోతల్లేని దేశాన్ని చూడాలంటే కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టాల్సిందే. కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడితోనే పేదలకు విద్య, వైద్యంలో మెరుగైన సేవలు అందుతాయి.
– స్వర్ణలత, ఉపాధ్యాయురాలు
దేశ భవిష్యత్‌కు కేసీఆర్ సేవలు అవసరం
భారతదేశ ఉజ్వల భవిష్యత్ కోసం కేసీఆర్ లాంటి ఉద్యమధీరుడి సేవలు చాలా అవసరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సబ్బండ వర్గాల సంక్షేమాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రైతుబంధు, దళితబంధు, 24 గంటలు కరెంట్ సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
– కాశమల్ల శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్ఎస్ హయత్‌నగర్
కేసీఆర్ రావడం శుభపరిణామం
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేశ ప్రజలపై అవగాహన ఉన్నది. అనేక అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొచ్చి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేయడం లేదు. ఇటువంటి పరిస్థితిలో దేశ రాజకీయాల్లోకి అన్ని అర్హతలు ఉన్న కేసీఆర్ వస్తుండటం నిజంగా శుభపరిణామం.
– బాపురెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్