మన్సూరాబాద్, సెప్టెంబర్ 12: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యులున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసుల సహకారంతో చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 1.20 కోట్ల విలువైన 360 కేజీల గంజాయి, 3 కార్లు, 8 సెల్ఫోన్లు, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా, ధవళేశ్వరం, ఐఓసీ కాలనీకి చెందిన కనుమారెడ్డి పవన్‌కుమార్ (31) డ్రైవర్. జల్సాలకు అలవాటు పడి, గంజాయి రవాణా వ్యాపారం మొదలు పెట్టాడు.
2021లో శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి, విడుదలయ్యాడు. తిరిగి గంజాయి అక్రమ రవాణాను కొనసాగిస్తున్నాడు. ఒడిశాకు చెందిన జిత్తు సహకారంతో పవన్‌కుమార్ గంజాయిని కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నాడు. కర్ణాటకకు చెందిన బాబాకు సైతం జిత్తుతో పరిచయం ఉంది. బాబా 360 కేజీల గంజాయిని రూ. 3.50 లక్షలకు జిత్తు వద్ద కొనుగోలు చేశాడు. బాబా కొనుగోలు చేసిన గంజాయిని పవన్‌కుమార్ సహకారంతో మహారాష్ట్రకు రవాణా చేయిస్తున్నాడు. గంజాయి రవాణా చేసేందుకు గాను ఏలూరుకు చెందిన డ్రైవర్ మంద సుధీర్‌బాబు (27), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోటిపల్లి లోవరాజ్ (28), గన్నవరానికి చెందిన డ్రైవర్‌గా పని చేసే తేజ (18)తో ఒప్పందం చేసుకున్నాడు. గంజాయి అక్రమ రవాణా కోసం సుధీర్‌బాబు బ్రీజా కారు, లోవరాజ్ ఎర్టీగా కారు, తేజ ఎర్టీగా కారును తీసుకువచ్చారు. ఒక్కో కారుకు రూ. 25 వేలతో పాటు అదనపు ఖర్చులను కూడా ఇస్తానని పవన్‌కుమార్ చెప్పాడు.
ఒక్క ట్రిప్‌కు భారీ మొత్తంలో కిరాయి వస్తుండటంతో సుధీర్‌బాబు, లోవరాజ్, తేజ గంజాయి అక్రమ రవాణాకు సిద్ధమయ్యారు. జిత్తు వద్ద నుంచి కొనుగోలు చేసిన 360 కేజీల గంజాయిని మూడు కార్లలో పెట్టుకుని వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లేందుకు బయలుదేరారు. వైజాగ్ నుంచి తీసుకువస్తున్న గంజాయిని చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద వేచి ఉన్న హైదరాబాద్, బేగంబజార్, చుడీబజార్‌కు చెందిన డ్రైవర్‌గా పనిచేసే పవన్ మనోహర్ తంబోలే (26), లాతూరు జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ సంతోష్ గంటే (31)కు అప్పగించాల్సి ఉంది. వైజాగ్ నుంచి మూడు కార్లలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎస్ఓటీ మల్కాజిగిరి బృందం, చౌటుప్పల్ పోలీసులు కలిసి చౌటుప్పల్ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద నిఘా పెట్టారు. మూడు కార్లలో చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్దకు వచ్చి గంజాయిని మనోహర్ తంబోలే, సంతోష్ గంటేకు అప్పగిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులైన కనుమారెడ్డి పవన్‌కుమార్, మంద సుధీర్‌బాబు, కోటిపల్లి లోవరాజ్, మిల్కుల తేజ, మనోహర్ తంబోలే, సంతోష్ గంటేను సోమవారం రిమాండ్‌కు తరలించారు. కేసుతో ప్రమేయమున్న మరో ముగ్గురు జిత్తు, బాబా, మంగేశ్ పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ కె. మురళీధర్, ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ ఇన్స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి, చౌటుప్పల్ సీఐ ఎన్. శ్రీనివాస్ పాల్గొన్నారు.