సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనోత్సవాలలో పోకిరీ చేష్టలకు పాల్పడిన 240 మందిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కోర్టులో హాజరు పరిచారు. వారికి రూ. 250 చొప్పున జరిమానా, 2 నుంచి 10 రోజుల వరకు జైలు శిక్షలు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పిందని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా షీ టీమ్స్ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్ర నేతృత్వంలోని బృందాలు 240 మంది పోకిరీలను అరెస్ట్ చేశాయి. పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరు పరుచగా వారికి న్యాయస్థానం శిక్షలు విధించింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కల్గించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష, ఆమె బృందానికి సీపీ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు.
సైబరాబాద్‌లో 11షీ టీమ్ బృందాలు
గణేశ్ నిమజ్జనంలో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతుల భద్రత కోసం 11 షీ టీమ్స్ బృందాలను రంగంలోకి దింపారు. 167 డెకాయి ఆపరేషన్లు నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రధాన నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపులో ఈ బృందాలు ఈవ్ టీజర్లపై నిఘా పెట్టినట్లు వివరించారు. ఒక్కో బృందంలో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. ఈవ్ టీజర్ల ఆట కట్టించేందుకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈనెల 9, 10తేదీల్లో జరిగిన నిమజ్జనం కార్యక్రమాల్లో ఈవ్ టీజింగ్‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు.