గోల్నాక, సెప్టెంబర్ 12 : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం గోల్నాక డివిజన్ గంగానగర్లో రూ. 8లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజవకర్గ వ్యాప్తంగా కొత్తగా ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు కాలనీలు, బస్తీలు అనే తేడాలేకుండా రహదారులను అద్దంలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. దీంతో పాటు మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల ప్రక్షాళన, పార్కుల సుందరీకరణ, కమ్యూనిటీహాళ్ల ఏర్పాటు వంటి పనులు విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ, మంచినీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ఇందుకు సంబంధించి నేటి అవసరాలకు అనుగుణంగా పైపులైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత పదిహేనేండ్లలో జరగని నియోజకవర్గ అభివృద్ధి కేవలం మూడేండ్లలో చేసి చూపించామని తెలిపారు. నియోజవకర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. అనంతరం బస్తీలో అధికారులతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు బస్తీవాసులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.