బంజారాహిల్స్,సెప్టెంబర్ 12: వారంరోజుల క్రితం ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తున్న డెంగీ కేసులు తగ్గుముఖం పట్టాయి. బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో వారం రోజులుగా జీహెచ్ఎంసీ, వైద్యసిబ్బంది కలిసి సంయుక్తంగా చేపట్టిన చర్యలతో దోమల ఉధృతి తగ్గుముఖం పట్టింది. వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు ఇంటింటికీ వెళ్లి జ్వరలక్షణాలు ఉన్న వారిని గుర్తించడంతో పాటు వారిని బస్తీ దవాఖానలకు పంపించి చికిత్స చేయించడంతో పాటు డెంగీని కలిగించే దోమలను నివారించేందుకు ఎంటమాలజీ విభాగం సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టడం మంచి ఫలితాలు ఇస్తోంది. వారం క్రితం సుమారు 30కి పైగా డెంగీ కేసులు నమోదు కాగా జ్వరసర్వేలో భాగంగా నమోదైన వివరాల ప్రకారం ప్రస్తుతం కేవలం 15 కేసులు మాత్రమే ఉన్నట్లు తేలింది. ఈ నెల 6న ఆయా ప్రాంతాల్లో జ్వర సర్వే ప్రారంభం కాగా ఈ సర్వేలో 9 బృందాలు పాల్గొంటున్నాయి. –
ఎన్బీటీనగర్లో జ్వర సర్వే పూర్తి
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్బీటీనగర్లో ఈనెల 6న ప్రారంభమైన జ్వర సర్వే పూర్తయింది. సుమారు 2500 ఇండ్లలో వైద్య సిబ్బంది సర్వే నిర్వహించగా, సుమారు 40మందిలో జ్వర లక్షణాలు ఉన్న ట్లు గుర్తించారు. వారిలో 9 మందికి మాత్రమే డెంగీ లక్షణాలు ఉన్నాయని తేలింది. దీంతో పాటు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం సిబ్బంది డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. ఎన్బీటీనగర్ బస్తీలో సుమారు 500కు పైగా ఇండ్లలో డెంగీ నివారణ ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా డెంగీ ఇన్ఫెక్టెడ్ దోమలను నివారించగలిగామని అధికారులు తెలిపారు. ఇందిరానగర్, షౌకత్నగర్ బస్తీల్లో ఇప్పటిదాకా 80శాతం జ్వర సర్వే పూర్తయింది. ఈ ప్రాంతాల్లో వారం రోజుల క్రితం 6 కేసులు నమోదు కాగా ప్రస్తుతం రెండు కేసులే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
దోమల నివారణపై ప్రత్యేక దృష్టి
డెంగీ కేసులు పెరగడంతో అన్ని ప్రాంతాల్లో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టాం. ఒకవైపు జ్వర సర్వేలో వైద్యశాఖతో పాటు మా సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.
సర్కిల్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లో చేపట్టిన సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయి. వారం క్రితం చాలా ఎక్కువగా ఉన్న డెంగీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. డెంగీని కలిగించే దోమలను నివారించేందుకు మా సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
-రజినీకాంత్రెడ్డి, డీఎంసీ, జీహెచ్ఎంసీ సర్కిల్-1