మారేడ్పల్లి, సెప్టెంబర్ 12: పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఆసరా పెన్షన్ లబ్ధ్దిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ…సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి ఒక పెద్దకొడుకు అయ్యారన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వాప్త్యంగా 10 లక్షల మంది అర్హులకు ప్రభుత్వం నూతనంగా పెన్ష న్లను మంజూరు చేసిందన్నారు. హైదరాబాద్కు 77,695 మందికి కొత్త పెన్షన్లు మంజూరు అయినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు అందించే ఆర్థ్ధిక సహాయాన్ని రూ. 2016 , దివ్యాంగులకు రూ. 3016 వరకు పెంచామన్నారు. అదేవిధంగా అమ్మాయి పెండ్లికి 1 లక్ష 116 రూపాయయాల ఆర్థ్ధిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని వెల్లడించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా చేస్తున్నామని దానిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, తరుణి , తహసీల్దార్లు శైలజ, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.