సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: పర్యావరణానికి పెనుభూతంగా పరిణమించిన నిషేధిత ప్లాస్టిక్‌పై సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిల్లో నియంత్రణ కొరవడింది. యథేచ్ఛగా విక్రయాలు, విచ్చలవిడిగా వినియోగం సాగుతోంది. అవగాహన రాహిత్యంతో ప్రజలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను అవసరం తీరిన తరువాత మురుగు కాలువల్లో పడేస్తున్నారు. దీంతో నీరు ఎక్కడికక్కడే నిలిచి రోడ్లపైకి ప్రవహిస్తోంది. స్వచ్ఛ భారత, స్వచ్ఛ తెలంగాణకు ప్లాస్టిక్ బ్యాగులే నిరోధకాలుగా మారాయి.
చోద్యం చూస్తున్న అధికారులు
వంద మైక్రాన్ల కంటే ఎక్కువ ఉండే ప్లాస్టిక్‌నే వినియోగించాలని కేంద్ర పర్యావరణ శాఖ జూలై 1న అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంద లోపు మైక్రాన్లు కలిగి ఉన్న ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వాడటం నేరం. ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే సంస్థల పేరు, చిరునామా, పరిమాణం తప్పనిసరిగా ముద్రించాలి. నిబంధనలు ఉల్లంఘించిన ఉత్పత్తి సంస్థలకు రూ.లక్ష జరిమానా విధించడంతోపాటు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీతో పాటు కంటోన్మెంట్ బోర్డు అధికారులు అడపాదడపా దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రధానంగా కంటోన్మెంట్ పరిధిలోని దుకాణాల్లో నిత్యం నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిషేధిత వస్తువులు ఇవే..
ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, కప్‌లు, స్వీట్‌బాక్స్‌లు, ఫుడ్ ప్యాకింగ్వాడే కవర్లు, ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, లాలీపాప్, చాక్లెట్లు ప్లాస్టిక్ స్టిక్స్, ఐస్‌క్రీమ్ పుల్లలు, థర్మాకోల్, వంద మైక్రాన్లలోపు పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ ఇన్విటేషన కార్డులు ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి.
దాడులు జరుపుతున్నాం
దుకాణాల్లో నిత్యం దాడులు జరుపుతూనే ఉన్నాం. వంద మైక్రాన్ల కంటే తక్కువ ఉంటే ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే దాడులు చేసి దుకాణాలను సీజ్ చేస్తాం. ఇప్పటికే ప్రజలకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు వేసే విధంగా నిత్యం ఆయా ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిఘా పెట్టి ఉంచడం జరిగింది. ప్లాస్టిక్ విక్రయాలకు సంబంధించి సమాచారం ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– దేవేందర్, సూపరింటెండెండ్,పారిశుద్ధ్య విభాగం, కంటోన్మెంట్ బోర్డు