మియాపూర్, సెప్టెంబర్ 12 : ఐటీ పరిశ్రమలకు వేదికైన శేరిలింగంపల్లి జోన్ సౌందర్యం మరింత పెంపొందేలా థీమ్ పార్కులను నిర్మిస్తున్నట్లు జోనల్ కమిషనర్ శంకరయ్య పేర్కొన్నారు. జోన్ వ్యాప్తంగా ఆయా సర్కిళ్లలో 12 థీమ్ పార్కుల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. జోన్లో థీమ్ పార్కుల ఏర్పాటు, వినాయక ప్రతిమల నిమజ్జనం అనంతరం పాండ్లలో వ్యర్థాల తొలగింపు, డబుల్‌బెడ్ రూం ఇండ్ల సర్వే అంశాలపై డీసీలు, ఇంజినీరింగ్ అధికారులు, బయోడైవర్సిటీ అధికారులతో జడ్సీ శంకరయ్య సోమవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. థీమ్ పార్కుల్లో సివిల్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ జాప్యం లేకుండా చూడాలన్నారు. సివిల్ పనుల అనంతరం బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో థీమ్ పార్కుల్లో పచ్చదనం పెంపునకు తగు చర్యలు చేపట్టాలన్నారు. పార్కులు విభిన్న థీమ్‌లు సహా పచ్చదనంతో కళకళలాడేలా చూడాలని జడ్సీ పేర్కొన్నారు. జోన్ పరిధిలోని ప్రజలకు ఆహ్లాదం , ఆలోచనను పెంపొందించేలా వాటిని తీర్చిదిద్దుతున్నట్లు, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీలు రమేశ్, బాలయ్య, ఈఈలు శ్రీకాంతిని, శ్రీనివాస్, ఎస్ఈ శంకర్ బయోడైవర్సిటీ అధికారులు పాల్గొన్నారు.