సికింద్రాబాద్, సెప్టెంబర్ 10:v తార్నాకకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ల్యాప్‌టాప్ కొనుగోలు కోసం రూ.60 వేలు లోన్‌యాప్ ద్వారా ప్రయత్నించాడు. నిమిషాల్లో రుణం మంజూరైంది. దీంతో ఆ విద్యార్థి ఎంతో సంతోషించాడు. కానీ అతడికి చెల్లించింది రూ.30 వేలు మాత్రమే. కానీ రూ.60వేలు చెల్లించాలని సంబంధిత యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
సీతాఫల్‌మండిలోని ఓ చిరుద్యోగి ఇంటి అవసరాల కోసం తన స్నేహితుడి సూచనతో లోన్ యాప్‌ను ఆశ్రయించాడు. తన ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అతడికి స్వల్ప మొత్తం రుణం మంజూరైంది. కానీ ఇప్పుడు దానికన్నా అధిక మొత్తం చెల్లించాలని నిర్వాహకుల నుంచి ఒత్తిడి వస్తోంది.
కొద్దిరోజుల కిందట కంటోన్మెంట్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులకు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నానని చెప్పడంతో ఆధార్ నంబర్లతో పాటు ఓటీపీ సంఖ్యను కూడా బాధితులు చెప్పారు. క్షణాల్లో వారి ఖాతాల నుంచి నగదు మాయమైంది. దీంతో బాధితులు లబోదిబోమంటూ బ్యాంకును ఆశ్రయించారు.
సికింద్రాబాద్‌కు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఒకరు ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసేందుకు వెళ్లాడు. అక్కడే మాటు వేసిన ఆగంతకుడు ఏమార్చి అతడి వద్ద ఉన్న ఏటీఎం కార్డును తీసుకున్నాడు. రూ.2 లక్షలు డ్రా చేసుకున్నాడు.
నగరంలో ఇలాంటి ఘటనలు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది మోసపోతూనే ఉన్నారు. అయితే చాలా మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. లోన్ తీసుకున్నప్పుడు సులభంగానే ఉన్నా..తరువాత యాప్ నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బయటకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందోనని బాధితులు ఇతరుల వద్ద అప్పుచేసి వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటున్నారు. లోన్‌యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయి మన వివరాలను, డాక్యుమెంట్లను వాట్సాప్‌లో పంపితే చాలు.. నిమిషాల్లో రుణం మంజూరవుతున్నది. యాప్‌లే కాదు.. బల్క్ ఎస్ఎంఎస్లు, లింక్‌లు.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ తదితర సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా తక్కువ వడ్డీలకు ఇన్స్టెంట్ లోన్లు అని ప్రచారం చేస్తూ..ఆకర్షిస్తున్నారు.
డేటా మొత్తం..
యాప్‌ను ఇన్స్టాల్ చేయగానే మొబైల్లోని డేటా మొత్తం వారి గుప్పిట్లోకి పోతుంది. ఫొటోలు, కాంటాక్ట్స్, కెమెరా, లొకేషన్లకు సంబంధించి ఇన్స్టాల్ సమయంలోనే అనుమతి తీసుకుంటారు. లోన్ యాప్‌లో పడి పర్మిషన్ ఇచ్చిన వెంటనే మన వివరాలన్నీ వారి సిస్టమ్‌లో నిక్షిప్తమవుతాయి. ఇలా మన మొబైల్ నుంచి తస్కరించిన కుటుంబసభ్యుల ఫొటోలు, స్నేహితుల ఫోన్ నంబర్లు, విలువైన పత్రాలు, గోప్యంగా దాచి ఉంచిన వ్యక్తిగత వివరాలు అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్‌కు దిగుతారు.
చక్రవడ్డీలు వేస్తూ ..
యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక..లోన్ కోసం రిక్వెస్ట్ వచ్చిందంటే ఇక యాప్ నిర్వాహకులు మోసాలకు తెరతీస్తారు. కొందరు రుణం మొత్తంలో ముందుగా సగమే పంపుతారు. కానీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటారు. మరికొందరు లోన్ డబ్బులు మొత్తం పంపించి వడ్డీలు, చక్రవడ్డీలు వేస్తూ చెల్లించాలని బెదిరిస్తారు. ఇంకొందరు డబ్బులు కట్టించుకుని తమకు ఆ మొత్తం చేరలేదంటారు. భయపెట్టి మళ్లీ మళ్లీ వాయిదాలు కట్టించుకుంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
లోన్‌యాప్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మూల్యం చెల్లించుకునే అవకాశమున్నది. ఎవరైనా లోన్‌యాప్ బాధితులు ఉంటే పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలి. లేదా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి వివరాలు అందించాలి. ముఖ్యంగా లోన్‌యాప్‌ల విషయంలో యువత, విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల మోసాలు పెరుగుతున్న దృష్ట్యా పోలీస్ శాఖ నిఘా పెంచడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. – సీహెచ్. నేతాజీ, సీఐ, మారేడ్‌పల్లి
వివరాలు చెప్పొద్దు
ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అనధికారిక వ్యక్తుల ఫోన్లకు స్పందించకూడదు. లింకులు ఓపెన్ చేయవద్దు. బ్యాంకు ఖాతా, ఆధార్, ఓటీపీ వంటి వివరాలు వెల్లడించొద్దు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధితులు వెంటనే బ్యాంకుతో పాటు పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలి. – బి. రవీందర్, సీఐ, కార్ఖానా