హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టిని సారించినదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ షేక్‌పేటలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ గురుకుల వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ‘స్వచ్ఛ గురుకులం’ కార్యక్రమాన్ని చేపట్టి ఆవరణను పరిశుభ్రంగా తీర్చిదిద్దిన అధికారులను, ప్రిన్సిపాల్‌ను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విదేశాల్లో చదువుకోవాలనే దళిత విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ నిధి ద్వారా ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని ఆయన తెలిపారు. తొలుత ప్రిన్సిపాల్ బాలస్వామి విద్యాలయ ప్రగతిని వివరించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి వినోద్ మొకలు నాటారు. అనంతరం, స్వచ్ఛ గురుకులం పోస్టర్లు, నినాదాల రూపకల్పన పోటీలను, ఆర్ట్ గ్యాలరీలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వినయ కళ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.