సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 10 : రూ.50 కోట్లతో హోల్‌సేల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ నిర్మించే ఏర్పాట్లు జరుగుతున్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలో కూకట్పల్లి, మల్లాపూర్‌లలో కూడా నూతన చేపల మార్కెట్లను నిర్మించే యోచన ఉన్నదని పశు సంవర్ధక,మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. రూ.9.50 కోట్ల వ్యయంతో బేగంబజార్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన చేపల మార్కెట్ భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం భవనమంతా కలియతిరిగి స్టాళ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బేగంబజార్ చేపల మార్కెట్‌కు ఎంతో చరిత్ర ఉందని, ఇంత పేరున్న ఫిష్ మార్కెట్లో సరైన వసతులు,సౌకర్యాలు లేక కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారని అన్నారు. ఈ భవనంలో 43 హోల్‌సేల్ స్టాళ్లు, కోల్డ్ స్టోరేజీ, 90 రిటైల్ స్టాళ్లు, 71 కటింగ్ స్టాళ్లు,10 డ్రైఫిష్ స్టాళ్లు ఏర్పాటు చేశామని..వ్యాపారం చేసుకునే వారికి మాత్రమే స్టాల్ కేటాయించడం జరుగుతుందన్నారు.
భవనం ఆరుబయట విక్రయాలు జరిపి ప్రజలకు,ఇతర వ్యాపారులకు ఇబ్బందులు కలిగించవద్దని, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుండడంతో మత్య్స సంపద భారీగా పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌వ్యాస్, బేగంబజార్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ పూజా వ్యాస్ బిలాల్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల టీఆర్ఎస్ ఇన్చార్జీలు ప్రేమ్‌సింగ్ రాథోడ్, ఆనంద్‌కుమార్‌గౌడ్, జీహెచ్ఎంసీ సీఈ దేవానంద్, బేగంబజార్ ఫిష్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పర్వత్సింగ్, కార్యదర్శి ప్రకాష్‌సింగ్,రాజ్‌కుమార్‌సింగ్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.