బడంగ్‌పేట, సెప్టెంబర్ 10 : గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రజలకు నిత్యం వార్తా, మాసపత్రికలు, పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు త్వరలో పౌర పఠన కేంద్రాలు (పబ్లిక్ రీడింగ్ రూమ్స్) అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 60 పౌర పఠన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచనల మేరకు అధికారులు చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో ఉన్న భవనాలను ఆధునీకరిస్తూ వాటిల్లో సౌకర్యాలు సమకూరుస్తున్నారు. తొలిదశలో 30 కేంద్రాలను ప్రారంభించనున్నారు. కాగా, గ్రంథాలయాల రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. అల్మారాల స్థానంలో కంప్యూటర్లు ఏర్పాటవుతూ డిజిటల్ ఫైల్స్‌గా పుస్తకాలు మారబోతున్నాయి. దిన, వార, పక్ష, మాసపత్రికల పఠనంపై పాఠకులకు అభిరుచి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. మారుతున్న కాలానుగుణంగా లైబ్రరీలను మార్పు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి వెల్లడించారు. ఇవి అందుబాటులోకి వస్తే విద్యార్థులు, విద్యావంతులు, మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉం టుందని, అన్ని దిన, వార,మాసపత్రికలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
పౌర పఠన కేంద్రాల పనులు వేగవంతం
పౌర పఠన కేంద్రాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పనులు పూర్తికాగా, మరి కొన్నిచోట్ల చురుగ్గా జరుగుతున్నాయి. కొన్ని కేంద్రాల గోడలపై గ్రంథాలయానికి సంబంధించి సూక్తులతోపాటు పుస్తకాల చిత్రాలు వేస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు.