కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 10 : వినాయక నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి ఘట్టమైన నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగియడంలో జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, విద్యుత్, ట్రాఫిక్ విభాగాల అధికారుల కృషి ఫలించింది. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో వినాయక ఉత్సవాలు, నిమజ్జన వేడుకల కోసం ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తలేదు. ప్రధాన చెరువుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఆయా విభాగాల అధికారులు పక్కా వ్యూహాలతో ఎవరికివారు బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ యంత్రాంగం ప్రత్యేక దృష్టితో పాటు జీహెచ్ఎంసీ యంత్రాంగం చేసిన ఏర్పాట్ల కారణంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదు. ముందస్తు ట్రాఫిక్ ఆంక్షలు, చెరువుగట్టుపై సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశాలు సత్ఫలితాలనిచ్చాయి.
కూకట్పల్లి జోన్లో 21,370 విగ్రహాలు నిమజ్జనం..
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఎనిమిది చెరువుల వద్ద నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు జరిగిన నిమజ్జన వేడుకల్లో జోన్ పరిధిలోని 21,370 విగ్రమాలను నిమజ్జనం చేశారు. వీటిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలు 10,203 ఉండగా.. మట్టి గణేశులు 11,167 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మూసాపేట సర్కిల్లో 7,347.. కూకట్పల్లి సర్కిల్లో 3,595.. కుత్బుల్లాపూర్ సర్కిల్లో 2,088.. గాజులరామారం సర్కిల్లో 4,958.. అల్వాల్ సర్కిల్లో 3,382.. విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.
చెరువులలో వ్యర్థాల తొలగింపు..
జోన్ పరిధిలో 8 చెరువులు, 7 కొలనులు, 5 ప్రత్యేక ట్యాంక్‌లలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఆయా చెరువులలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే వ్యర్థాలను తొలగించే పనులను చేపట్టారు. ఇప్పటి వరకు జోన్ పరిధిలోని అన్ని చెరువులలో కలిపి 9వేలకు పైగా మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. గణనాథుడి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల సందర్భంగా ఉపయోగించి పడేసిన పూలదండలు, పూజా సామాగ్రిని ఎప్పటికప్పుడు ప్రత్యేక వాహనాలలో తరలించారు. చెరువులలో వేసిన విగ్రహాల వ్యర్థాలను ప్రత్యేక నిపుణులు, యంత్రాల సహాయంతో బయటికి తీసి ప్రత్యేక వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఇనుప ముక్కలు, మట్టిని వేరు చేస్తూ వ్యర్థాలన్నింటినీ ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. మరోవైపు కొలనులలో వేసిన చిన్న విగ్రహాల వ్యర్థాలను సైతం తొలగిస్తున్నారు. కాలనీలు బస్తీలలో రోడ్లపై చెత్తాచెదారాన్ని తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు అధికారులు తెలిపారు.
భక్తులందరికీ ధన్యవాదాలు..
వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నవరాత్రోత్సవాలు, నిమజ్జన వేడుకల కోసం జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు జలమండలి, పోలీస్ విభాగం, విద్యుత్ శాఖ, ట్రాఫిక్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేశాం. చెరువుల వద్ద చేసిన ప్రత్యేక ఏర్పాట్లు, ముందస్తు చర్యల వల్ల నిమజ్జన వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. చెరువుల్లో వ్యర్థాలను తొలగించడం, రోడ్లు, పరిసరాలను పరిశుభ్రం చేసే పనులపై దృష్టిసారించాం.
– వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి