బేగంపేట్, సెప్టెంబర్10: గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బాపునగర్‌కు చెందిన గిరిజన సంఘం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.53 కోట్ల వ్యయంతో నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కోమురం భీమ్ ఆదివాసీ భవన్లను ప్రారంభిస్తారని పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. భవనాల ప్రారం భం అనంతరం తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ వేడుకలలో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజెప్పే కళాప్రదర్శనలు కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. పెద్ద సంఖ్య లో గిరిజనులు హాజరయ్యే విధంగా బస్తీలలో సమావేశాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, హరిసింగ్ జాదవ్, కిషన్‌సింగ్, బాలు నాయక్, సీతారాం, రాజునాయక్, రాణిభాయి, విక్రమ్‌రాథోడ్, వీటీ నాయక్ పాల్గొన్నారు.