సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నగరంలో శుక్రవారం గణనాథుల నిమజ్జనం వైభవంగా.. ప్రశాంతంగా జరిగింది. వర్షం కురుస్తున్నా.. లెక్కచేయకుండా.. గంగ ఒడికి చేరిన గణనాథులను చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో సాగరతీరం సందడిగా మారింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 40 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయగా, అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
ప్రతి కదలికలను నిరంతరం వీక్షించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగిన ప్రధాన శోభాయాత్ర రూట్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు ఆనంద్, మహేశ్‌భగవత్, స్టీఫెన్ రవీంద్ర నిమజ్జన ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్మార్గ్తో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పోలీసులు హెల్ప్ లైన్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు.
కమాండ్ కంట్రోల్ నుంచి..
నగరంలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్లు కమాండ్ కంట్రోల్ నుంచి వీక్షించారు. అలాగే డ్రోన్ కెమెరాలతో ఈ సారి బందోబస్తును మరింత పటిష్టం చేశారు. వెహికల్ మౌంటెడ్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. కాగా, గతేడాదితో పోలిస్తే ఈసారి ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన ఘట్టం ఆలస్యమైంది. వర్షాల కారణంగా బాలాపూర్, ఖైరతాబాద్ గణనాథుల నిమజ్జనాలు ఆలస్యంగా జరిగాయి. లక్షలాది మంది ఈ ఘట్టాన్ని చూసేందుకు వచ్చారు. ప్రజలు భారీగా తరలిరావడంతో పోలీసులు ఎన్టీఆర్మార్గ్, ట్యాంక్బండ్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక గణనాథుల శోభాయాత్ర అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. శనివారం వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
అన్ని శాఖల సమన్వయంతో..
గణేశ్ నిమజ్జనోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయి పరిశీలించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. షీ టీమ్స్ ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయని, అనేక మంది ఆకతాయిలు పట్టుబడ్డారని చెప్పారు. కాగా, సీపీ ఆనంద్ ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లోని నిమజ్జన కేంద్రాలను సీపీ మహేశ్‌భగవత్ సందర్శించారు. అన్ని శాఖల సమన్వయంతో పాటు ఆరు వేల మంది బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పలు చెరువుల వద్ద ఏర్పాట్లు, నిమజ్జనం సాగుతున్న తీరును కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శామీర్‌పేట్, హస్మత్‌పేట్, సూరారం, కూకట్పల్లి, ఐడీఎల్ చెరువులను ఆయన సందర్శించారు.