అల్లాపూర్, సెప్టెంబర్9: ఈనెల 3న జరిగిన ఓ వ్యక్తి హత్య కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. అతడి స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. శుక్రవారం ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. మహ్మద్ గౌస్ భరత్‌నగర్ వెళ్లే దారిలో ఉన్న పంచర్షాపులో పనిచేస్తూ..జీవనం సాగిస్తున్నాడు. పదేండ్ల కిందట నూర్బేగంను ప్రేమ వివాహం చేసుకోగా, వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. మద్యానికి బానిసైన గౌస్ భార్యతో గొడవ పడి..
రెండ్రోజులుగా ఇంటికి రాలేదు.ఈ నెల 2న ఆదివారం స్నేహితులు మహ్మద్ మహబూబ్(34) మొద్దులగండం కుషాల్, మహ్మద్ హనీఫ్ గౌస్‌ను మద్యం తాగుదామంటూ ఖైత్లాపూర్ మైదానికి పిలిపించారు. పాత కక్షలను మనసులో పెట్టుకున్న వీరు.. మద్యం తాగాక.. గౌస్‌పై కత్తి, బ్యాట్, రాళ్లతో దాడి చేసి హతమార్చారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.