శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండలో అదృశ్యమైన రాగ్యానాయక్‌ను నిందితులు కృష్ణానదిలో పడేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. భార్య సహకారంతోనే ఈ హత్య జరిగిందని, వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తేల్చారు. రాయదుర్గం సీఐ తిరుపతి కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, లావుతండా గ్రామానికి చెందిన ధనావత్ రాగ్యానాయక్(28) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య తన బావ లక్పతి అలియాస్ లక్కీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం రాగ్యానాయక్‌కు తెలియడంతో ఇద్దరిని నిలదీశాడు. ఎలాగైనా రాగ్యానాయక్ అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసిన లక్కీ విషయాన్ని రాగ్యా భార్యకు చెప్పి ఒప్పించాడు. అనంతరం హత్యకు పథకం రచించాడు. గతనెల 19న లక్కీ డబ్బులు ఇస్తానని రాగ్యాను పిలిచాడు. శంషీగూడకు చెందిన చెన్నుపల్లి వెంకట శివ నాగ మల్లేశ్వరరావు(30)తో కలిసి వేచి ఉన్నాడు. రాగ్యా రాగానే రూ. 10 వేలు ఇచ్చి.. మిగతా డబ్బులు నాగార్జున సాగర్ వైజాగ్ కాలనీకి వెళ్లి తెచ్చుకుందామని కారులో తీసుకెళ్లాడు.
నిద్రమాత్రలు కలిపిన బాదం పాలు రాగ్యానాయక్‌కు ఇచ్చారు. అతడు అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో వైజాగ్‌కాలనీకి చేరుకున్న వీళ్లు.. అక్కడ చేపల వ్యాపారి పత్లావత్ మాన్సింగ్(32), పంకునావత్ బాలాజీ(23)లను కలిశారు. అందరూ కలిసి రాగ్యానాయక్ కాళ్లు, చేతులు కట్టేసి.. చేప వలలో చుట్టి.. కాశీ రాజుపల్లి పుష్కర్‌ఘాట్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పడవలో కృష్ణా బ్యాక్‌వాటర్ కాలువలో పడవేశారు. సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హతుడి భార్యతో పాటు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.