చర్లపల్లి, సెప్టెంబర్ 8: మరి కొద్ది సేపటిలో ఆ విద్యార్థులు ఇంటికి చేరుకుంటారు. అంతలోనే అతివేగంతో దూసుకువచ్చిన లారీ వారి పాలిట యమపాశంగా మారింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో నలుగురు విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురు విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఈ ఘటన గురువారం రాత్రి కుషాయిగూడ పరిధిలో జరిగింది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం.. చిన్న చర్లపల్లి, మోడీ అపార్ట్మెంట్లో నివాసముండే విద్యార్థులు రిషి కుమార్, కోమలి లత గుప్త (11) ఈసీఐఎల్ చౌరస్తాలోని శ్రీచైతన్య స్కూల్లో చదువుతున్నారు. తన్మయి (13) రిషిప్రియ, రిషి వల్లభ నారాయణ స్కూల్లో చదువుతున్నారు. వర్షిక రవీంద్రభారతి స్కూల్లో చదువుతున్నది. ఈ ఆరుగురు విద్యార్థులు ప్రతి రోజూ ఇంటి నుంచి విస్తావత్ వినోద్ ఆటోలో వెళ్తూ.. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తారు. గురువారం సాయంత్రం కూడా వినోద్ ఆటోలో స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని జైలు టర్నింగ్ వద్ద అతివేగంగా దూసుకువచ్చిన లారీ అదపుతప్పి విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీ కొట్టింది.
ఆటోలో ఉన్న ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని పారిశ్రామికవాడలోని కార్మికులు, బాటసారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన ఆరుగురు విద్యార్థులను ఈసీఐఎల్ చౌరస్తాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థినులు కొమలి లత గుప్త, తన్మయి మృతి చెందారు. ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు విద్యార్థులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పిల్లలు ఇంకో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటున్నారని భావించాం.. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు విలపించారు. మృతి చెందిన కొమలి లత గుప్త, తన్మయి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, వాహనాదారులు పేర్కొన్నారు. చర్లపల్లి నుంచి చక్రీపురం వైపు వస్తున్న లారీ డ్రైవర్ ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి ఆటోను ఢీకొట్టాడని బాటసారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు.
బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ పావనీ మణిపాల్‌రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటాం.. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులకు సూచించారు.