సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 15న జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైద్యాధికారులు, ఆశా వర్కర్లు, విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు జారీ చేశారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 10,71,855 మంది పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, మురికివాడలు తదితర ప్రాంతాల్లో 1-19 ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లలకు ఈ నెల 15, 22తేదీలలో అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖతోపాటు విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది సమష్టిగా పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.