సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో డెంగీ జ్వరాలను కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు జ్వర సర్వేను ముమ్మరం చేశారు. హైదరాబాద్ నగరంలో కేసు నమోదైన ప్రతి కాలనీ, బస్తీలో సర్వే నిర్వహిస్తుండగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో 3కేసులు నమోదైన ప్రాంతాల్లో జ్వర సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే గ్రేటర్ సహా మూడు జిల్లాల్లో మొత్తం 8414ఇండ్లలో జ్వర సర్వే నిర్వహించారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 4825 ఇండ్లలో జ్వర సర్వే జరిపి 98 మంది జ్వర పీడితులను గుర్తించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 3098ఇండ్లలో జ్వర సర్వే నిర్వహించి, 193 మంది జ్వర పీడితులకు చికిత్స అందించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 208 మంది నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 500 ఇండ్లలో జ్వర సర్వే జరిపినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీతో కలిసి 8018ఇండ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ జరిపినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
జ్వర సర్వే చేస్తున్నాం.. ఆందోళన వద్దు..
డెంగీ నివారణకు జ్వర సర్వే జరుపుతూ కేసులను డిటెక్ట్ చేస్తున్నాం. కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నాం. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడం సహజం. ఈ సారి వానలు ఎక్కువగా, వరుసగా కురువడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు అర్బన్ ఏరియాల్లో డెంగీ కేసులు కూడా నమోదవుతున్నాయి. సీజనల్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ జె.వెంకటి,హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి