వెంగళరావునగర్, సెప్టెంబర్ 7 : గోవా నుంచి మాదక ద్రవ్యాలు తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు పట్టుకున్నారు. వారినుంచి 10 గ్రాముల ఎండీఎంఏ, 12.2గ్రాముల 28ఎక్స్టాసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవాకు చెందిన శ్యామ్, ఆర్జే.షిండే, అఫ్జల్, సత్యనారాయణ మూర్తి నిషేధిత మాదక ద్రవ్యాలైన ఎండీఎంఏ, ఎక్స్టాసీ పిల్స్‌ను సేకరించి బొల్లారంలో నివాసముండే యుగంధర్(27), రహ్మత్‌నగర్‌కు చెందిన రిషబ్ శ్రీవాస్తవ(26)లకు ఇచ్చేవారు.
వారు నగరంలోని అవసరమైన వారికి వాటిని గ్రాముకు రూ.2 వేల నుంచి రూ.2500లకు విక్రయించేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇన్స్పెక్టర్ రమేశ్ రెడ్డి నేతృత్వంలో మధురానగర్‌లోని వెల్లంకి ఫుడ్స్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యుగంధర్, రిషబ్ శ్రీవాస్తవలను పట్టుకున్నారు. వారి నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొని తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. గోవాకు చెందిన నలుగురు మాదక ద్రవ్యాల సరఫరాదారులతో పాటు 25మంది వినియోగదారులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.