సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఈనెల 9న వినాయక నిమజ్జనోత్సవాలను దృష్టిలో పెట్టుకొని నిమజ్జన కేంద్రాలపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు నిమజ్జన కేంద్రాలను సందర్శించారు. కూకట్పల్లి పరిధిలోని ఐడీఎల్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లను, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా మానిటరింగ్ రూమ్‌లో సీసీటీవీలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. సీపీ వెంట క్రైం డీసీపీ కల్మేశ్వర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఎస్బీ ఏడీసీపీ రవికుమార్, ఎస్ఓటీ ఏడీసీపీ నారాయణ, తదితరులు ఉన్నారు.