సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ): అది 1952. ముల్కీ సమస్యతో ఉద్యోగులు, విద్యార్థులు సతమతమవుతున్న రోజులు. మా ఉద్యోగాలు మాకివ్వండి.. అన్నందుకు నెత్తురు పారించారు. వచ్చిన ఉద్యోగాలను సైతం తొలగించి వాటి స్థానంలో నాన్ ముల్కీలను (స్థానికేతరులు) నియమించి రాక్షస పాలన చేశారు. ఇదేంటని ప్రశ్నించిన గొంతులపై లాఠీలు విరుచుకుపడ్డాయి. అయినా.. విద్యార్థులు వెనుకడుగు వేయలేదు.
దిక్కులన్నీ పెక్కటిల్లేలా ‘నాన్ ముల్కీ గో బ్యాక్.. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ అంటూ నినాదాన్ని ఎత్తుకొని పోరాటానికి దిగారు. ఇది మింగుడు పడని ఆనాటి పాలకుల ఆదేశాలతో సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 8 మంది విద్యార్థుల మరణానికి కారణమయ్యారు. ముల్కీ ఉద్యమాన్ని నలువైపులా దావనంలా వ్యాపించేలా చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజల పోరాటాలు నేటికి ఓ ఆదర్శం. ఆనాటి నుంచే తెలంగాణ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పారు. 1952 సెప్టెంబర్ 4న జరిగిన కాల్పులకు 70 ఏండ్లు పూర్తయింది.
ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రజలపై పెత్తనం చేలాయించడం, తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన ఉద్యోగాలను నాన్ ముల్కీలైన ఆంధ్ర ప్రజలు తప్పుడు ధృవపత్రాలతో పొందడం.. ఇలా ఎన్నో అరాచకాలు తెలంగాణ ప్రజలపై, విద్యార్థిలోకంపై జరిగాయి. వరంగల్‌లోని డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా నియమించబడిన పార్థసారథి 1952 జూన్, జూలైలో 180 మంది ఉపాధ్యాయులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. వీరి స్థానంలో ఆంధ్రకు చెందిన ఉపాధ్యాయులను నియమించారు. నాన్ ముల్కీ అయిన పార్థసారథి చాలా ఇబ్బందులకు గురి చేశాడు. నాన్ ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని వరంగల్ విద్యార్థులు చేపట్టిన ర్యాలీలో నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.. అనే నినాదాలతో దద్దరిల్లింది. ఈ ర్యాలీనే 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా నిపుణులు తెలిపారు.
ఉపాధ్యాయులపై జరిగిన బదిలీ, దాడికి నిరసనగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి ముల్కీ సమస్యపై పోరాడారు. హన్మకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకపడ్డారు. సెప్టెంబర్ 3న నగర సిటీ కాలేజీ వద్ద పోలీసుల కాల్పులు జరిగాయి. విద్యార్థులంతా తరగతులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు సైఫాబాద్ సైన్స్ కాలేజీ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. అప్పటి సిటీ కమిషనర్ శివకుమార్ లాల్ తీవ్ర ఆంక్షలు జారీ చేశారు. సిటీ కాలేజీ ఆవరణలో విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రజలు, విద్యార్థులు మరింతగా దూకుడు ప్రదర్శించారు.
దీంతో పోలీసులు విద్యార్థులపై కాల్పులు జరిపారు. ముల్కీ ఉద్యమం రక్తసిక్తమైంది. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను అప్పగించే విషయంలో పోలీసులు మళ్లీ విద్యార్థులపై కాల్పులు జరిపారు. సెప్టెంబర్ 4న జరిపిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారు. వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. 1952, సెప్టెంబర్ 3న సిటీ కాలేజీ, సెప్టెంబర్ 4న ఉస్మానియా ఆస్పత్రి వద్ద జరిగిన పోలీసు కాల్పులపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని అప్పటి రాష్ట్ర సీఎం బూర్గుల రామకృష్ణారావు హైకోర్టు న్యాయమూర్తి పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్ని ఆదేశించారు.
నాన్ ముల్కీల ఆధిపత్యం, పరోక్షంగా వారికి అందుతున్న ప్రభుత్వ మద్ధతుతో సహజంగానే హైదరాబాద్ ప్రజల అసంతృప్తికి కారణమైంది. వరంగల్‌లో మూకుమ్మడిగా జరిగిన ఉపాధ్యాయ బదిలీలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ముల్కీ ఉద్యమం హైదరాబాద్‌కు దావనంలా వ్యాపించింది. తెలంగాణ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒకటైన నియామకాల కోసం విద్యార్థులు చేసిన మహోద్యమం ఆనాటి ముల్కీ ఉద్యమం. ప్రత్యక్ష రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని.. ఆంధ్రలో ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయకూడదని తెలంగాణ ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు రూపమే ఆ మహోత్తర ముల్కీ ఉద్యమం. తెలంగాణలో ప్రతీ పోరాటం ప్రపంచానికి
ఓ ఆదర్శం.