సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ముందస్తు సమాచారంతో అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వేగంగా ఆస్పత్రులకు వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు మార్గం మరింత సుగుమం చేయనున్నారు. అత్యవసరం కాకున్నా.. అంబులెన్స్ వాహనాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకోనున్నారు. ప్రతిరోజూ వందలాది అంబులెన్స్‌లు నగరంలో రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో కొన్ని అంబులెన్స్‌లు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగిని తీసుకెళ్తుంటాయి.
ఎమర్జెన్సీ సేవలకు పోలీసులు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ప్రతి అంబులెన్స్ వాహనంలో ఉండే రోగి పరిస్థితులను బట్టి పోలీసులు వేగంగా స్పందించనున్నారు. అయితే, ముందుగా అంబులెన్స్‌కు సంబంధించిన వివరాలను ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు చెబితే, అక్కడి నుంచి స్థానిక ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందిస్తారు. అంబులెన్స్ వచ్చే సమయానికి గ్రీన్ సిగ్నల్స్ వచ్చేలా చేస్తారు. దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు.
స్వయంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యలను తెలుసుకుంటున్నారు. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఆటోమెటిక్‌గా పనిచేయనుంది. ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ పనిచేసిన సమయంలో ఏ కూడలిలో ఎంత సేపు వాహనాలు ఆగుతున్నాయి.. ఆ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ఎంత సమయం పడుతుంది.. అనే అంశంపై ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరుగుతున్నది. ఈ అధ్యయనం నివేదిక ఆధారంగా సిగ్నిల్ టైమింగ్‌ను సెట్ చేయనున్నారు. అయితే, ఇది అన్ని సిగ్నల్స్ వద్ద సాధ్యం కాదని, తక్కువ దూరంలో ఉండే సిగ్నల్స్‌కు మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చారు.
అంబులెన్స్‌లు కొన్ని దవాఖాన నుంచి రోగి దగ్గరకు, రోగిని తీసుకొని దవాఖానకు, దవాఖాన నుంచి పార్కింగ్ అడ్డాకు, డ్రైవర్ ఇంటికి తీసుకొని వెళ్లడం, దవాఖానకు సంబంధించిన ఇతర పనుల నిమిత్తం వెళ్లడం.. ఇలా పలు రకాల పనుల నిమిత్తం నగరంలో తిరుగుతుంటాయి. ఇందులో అత్యవసరం ఏదీ, అత్యవసరం కానిది ఏదీ అనేది తేలాలి. ఈ అంశంపై ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా.. రోగిని తీసుకొని ఏ దవాఖాన నుంచి అంబులెన్స్ బయలుదేరుతుంది.. ఎక్కడికి వెళుతుంది.. అనే సమాచారం ముందస్తుగా ట్రాఫిక్ పోలీసులకు ఇస్తే.. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకుంటారు. అత్యవసరం కాకున్నా.. అంబులెన్స్ సైరన్లను మోగిస్తూ, అంబులెన్స్ ప్రాధాన్యతను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అనుమానం వస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆపి తనిఖీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి.
అంబులెన్స్‌లకు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయి పరిశీలనలో కొందరు అంబులెన్స్‌లో పెషెంట్స్ లేకున్నా, అత్యవసరం కాకున్నా అంబులెన్స్ సైరన్ల మోత మోగిస్తున్నారు. అసలైన వారికి ప్రాధాన్యత ఇస్తూ, అవసరం లేని వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు ముందస్తుగా దవాఖానలు, అంబులెన్స్ సర్వీస్‌ల నుంచి సమాచారం అందిస్తే ఆయా రూట్లలో ఆ అంబులెన్స్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తాం. సమాచారం ఇచ్చేందుకు ట్రాఫిక్ కంట్రోల్ రూం(8712 660600)కు ఫోన్ చేయాలి. అత్యవసరం కాకున్నా, అత్యవసరంగా వెళ్లేందుకు అంబులెన్స్‌ను దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే అలాంటి అంబులెన్స్‌లను సీజ్ చేస్తాం.