మేడ్చల్, సెప్టెంబర్4(నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మరో 7500 మందికి దళితబంధు పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 1500 మందికి త్వరలో దళితబంధు పథకాన్ని అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 565 మందికి దళితబంధు పథకాన్ని అందజేశారు. రూ.56.20 కోట్ల నిధులతో ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10 లక్షల చొప్పున అందజేశారు.
ఈ నిధులతో లబ్ధిదారులు వివిధ వ్యాపారాలను ప్రారంభించి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నారు. ఇదిలా ఉండగా, త్వరలోనే మరింత మందికి దళితబంధు పథకం అందనుండటంతో దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా 40 రకాల వ్యాపారాలు నిర్వహించేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి అవగాహన కల్పించడంతోపాటు లబ్ధిదారులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా లైసెన్సులు, జీఎస్టీకి సంబంధించిన పనులను కూడా అధికారులే స్వయంగా పూర్తి చేస్తున్నారు.
దళితుల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దళితులందరినీ ధనవంతులు చేసేందుకు దళితబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చరిత్రలో నిలిచిపోతుంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో త్వరలోనే మరో 7500 మందికి ప్రభుత్వం దళితబంధును వర్తింపజేయనున్నది. ఒక నియోజకవర్గంలో 1500 మంది దళితులకు ఈ పథకం వర్తింపజేయనుండటంతో దళితులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళితులందరికీ ఈ పథకం వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.